sticky

OUR HABBITS - THEIR EFFECTS ON KIDNEYS

మూత్రపిండాలు నిరంతరం రక్తంలోంచి వ్యర్థాలను వడపోసి బయటకు పంపిస్తుంటాయి. రక్తపోటునూ నియంత్రిస్తుంటాయి. ఇంతటి కీలకమైన పనులు చేసే కిడ్నీలపై మన రోజువారీ అలవాట్లు గణనీయమైన ప్రభావం చూపుతాయి. అందువల్ల కిడ్నీలకు హాని చేసే అలవాట్ల గురించి తెలుసుకుని ఉండటం అవసరం.
ఎక్కువగా ప్రోటీన్‌ తీసుకోవటం: అధికంగా ప్రోటీన్‌ గల పదార్థాలను తింటే కిడ్నీలపై భారం పడుతుంది. రక్తంలో ఉండే యూరియా నైట్రోజెన్‌ను (బీయూఎన్‌- బ్లడ్‌ యూరియా నైట్రోజెన్‌) బయటకు పంపించటానికి కిడ్నీలు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ క్రమంగా మందగిస్తుంది. కాబట్టి ప్రోటీన్‌ మోతాదు మితిమీరకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మీరు 72.5 కిలోల బరువుంటే.. ఆహారంలో రోజుకి 80 గ్రాముల ప్రోటీన్‌ కన్నా మించకుండా చూసుకోవాలి.
సమస్యలను నిర్లక్ష్యం చేయటం: దగ్గు, జలుబు, గొంతునొప్పి, టాన్సిల్స్‌ వాపు వంటి సమస్యలను చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని గుర్తించాలి. జలుబు, తలనొప్పి, వాంతి, వికారం, నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి ఒకట్రెండు వారాల్లో తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మంచిది.
ఉప్పు ఎక్కువగా తినటం: ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుంది. ఉప్పును ఎక్కువ మోతాదులో తింటే రక్తపోటును నియంత్రించే కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటుతో కిడ్నీ వైఫల్యం ముప్పు పొంచి ఉంటుంది. అందువల్ల ఉప్పు వాడకంలో పరిమితి పాటించటం మంచిది.
కూల్‌డ్రింకుల వాడకం: రోజుకి 710 ఎం.ఎల్‌ కూల్‌డ్రింక్‌ తాగే అలవాటు గలవారి మూత్రంలో ప్రోటీన్‌ స్థాయులు చాలా ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఇది కిడ్నీజబ్బుకు ప్రధాన ముప్పు కారకమని గుర్తించాలి.
నొప్పి నివారణ మందులు: నొప్పిని తగ్గించే మందులను దీర్ఘకాలం పాటు వాడినా, కొన్నిరకాల మందులను పెద్ద మోతాదులో వాడినా కిడ్నీ కణజాలం దెబ్బతినే ప్రమాదముంది. అలాగే కిడ్నీలకు రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఈ మందుల ప్రభావం చాలాకాలం తర్వాత గానీ బయటపడకపోవటం గమనార్హం.
నీటి శాతం తగ్గటం: ఒంట్లో నీటి శాతం తగ్గిపోయినపుడు (డీహైడ్రేషన్‌) కిడ్నీ పనిచేయటానికి తగినంత ద్రవాలు అందుబాటులో ఉండవు. ఇక డీహైడ్రేషన్‌ మరింత తీవ్రమైతే కిడ్నీలు దెబ్బతినే ముందస్తు దశకూ దారితీస్తుంది.
పొగ, మద్యం: సిగరెట్లు, బీడీలు తాగటమనేది కిడ్నీలపై నేరుగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులతో బాధపడుతుంటే పొగ మూలంగా ఈ సమస్యలు తీవ్రమవుతాయి. ఇది కిడ్నీ జబ్బులకు దోహదం చేస్తుంది. ఇక మద్యం అలవాటుతో మూత్రనాళాల్లో యూరిక్‌ యాసిడ్‌ పోగుపడటం ఆరంభమవుతుంది. ఫలితంగా మూత్రనాళాల్లో అడ్డంకులు తలెత్తి కిడ్నీ వైఫల్యమూ ముంచుకురావొచ్చు.

Contact Form for ganavzm

Name

Email *

Message *